2018లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు

Tuesday, January 1, 2019 02:32 PM Automobiles
2018లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు

2018 వ సంవత్సరం ముగింపుకొచ్చింది, ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ ఏడాది ఎన్నో వేడుకలకు వేదికయ్యిందని చెప్పవచ్చు. 2018 ఫిబ్రవరిలో జరిగిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఆటో ఎక్స్‌పోతో మొదలు... ఎన్నో కొత్త కార్లు మరియు సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన ఫేస్‌లిఫ్ట్ కార్లు ఈ ఏడాదిలో విడుదలయ్యాయి. 2018లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్ల గురించి ప్రత్యేక కథనం మీ కోసం...

10. 2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న కార్ల శ్రేణిలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ సియాజ్. మారుతున్న కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని జోడిస్తూ... విభిన్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు మారుతి తమ సియాజ్ సెడాన్ కారును పలు డిజైన్ అప్‌డేట్స్, నూతన ఇంజన్ మరియు సరికొత్త ఫీచర్ల జోడింపుతో అందుబాటులోకి తీసుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

9. ఫోర్డ్ ఫ్రీస్టైల్
అమెరికాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ 2018 సంవత్సరం వేదికగా విపణిలోకి సరికొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ సీయువీ(కాంపాక్ట్ యుటిలిటి వెహికల్)ను లాంచ్ చేసింది. ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఫ్రీస్టైల్ కారును డెవలప్ చేసింది. సాంకేతికంగా రెండు కార్లలో కూడా ఒకే తరహా ఇంజన్‌లు ఉన్నాయి. కానీ, ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఎన్నో ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లను అందించారు.

8. 2018 హోండా అమేజ్
హోండా మోటార్స్ గత ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో షోలో తమ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ సెకండ్ జనరేషన్ మోడల్‌ను లాంచ్ చేసింది. హోండా సిటీ ఆధారంగా పూర్తి స్థాయిలో కొత్త డిజైన్‌లో వచ్చింది. ఇందులో అవే మునుపటి ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ యథావిధిగా వచ్చినప్పటికీ... డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మారుతి డిజైర్ కారుకు సరాసరి పోటీనిచ్చింది. ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా లైనప్‌లో హోండా అమేజ్ అత్యంత విక్రయాలు సాధిస్తున్న మోడల్‌గా మొదటి స్థానంలో నిలిచింది.

7. 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ మోటార్స్ తమ పాపులర్ క్రెటా ఎస్‌యూవీ గత ఏడాది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు... అయితే, ఎక్ట్సీరియర్ డిజైన్, స్టైలింగ్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులు సంభవించాయి. అత్యంత సరసమైన ధరలో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ లక్షణాలు కలిగిన 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌‌లిఫ్ట్ మంచి సక్సెస్ సాధించింది.

6. టాటా టియాగో జెటిపి & టిగోర్ జెటిపి
టాటా మోటార్స్ టియాగో మరియు టిగోర్ మోడళ్లతో భారీ విజయాన్ని సాధించింది. అయితే, పర్ఫామెన్స్ కార్లను ఇష్టపడే కష్టమర్ల కోసం టాటా తమ టిగోర్ మరియు టియాగో రెండు కార్లను కూడా అత్యుత్తమ పవర్ అవుట్‌పుట్ ఇచ్చేలా సాంకేతికంగా పలు మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా టాటా మోటార్స్ విడుదల చేసిన తొలి పర్ఫామెన్స్ మోడళ్లు కూడా ఇవే.

5. మహీంద్రా ఆల్టురాస్ జీ4
ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి సరికొత్త ఆల్టురాస్ జీ4 ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మహీంద్రా లైనప్‌లో ఉన్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి పై స్థానంలో ప్రవేశపెట్టింది. ఈ ఆల్టురాస్ జీ4 ఎస్‌యూవీని మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్‌కు చెందిన నాలుగవ తరం రెక్ట్సాన్ ఆధారంగా అభివృద్ది చేశారు. ఇది విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మిత్సుబిషి పజేరో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

4. మహీంద్రా మరాజొ
దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపీవీ కార్ల సెగ్మెంట్లోకి తమ తొలి ఉత్పత్తిగా మరాజొ ఎంపీని ప్రవేశపెట్టింది. షార్క్ చేప తరహా డిజైన్ మరియు అత్యుత్తమ క్లాస్ లీడింగ్ ఫీచర్లు, 7 మరియు 8 సీటింగ్ ఆప్షన్స్ దీని ప్రత్యేకం. అంతే కాకుండా అంతర్జాతీయ ఎన్సీఏపీ క్రాష్ట్ టెస్టులో ఐదింటికి నాలుగు స్టార్ల రేటింగ్ దక్కించుకున్న తొలి మేడిన్ ఇండియా ఎంపీవీ మహీంద్రా మరాజొ.

3. సరికొత్త మారుతి ఎర్టిగా
మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎంపీవీని అధునాతన డిజైన్, నూతన శైలి మరియు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్విఫ్ట్ మరియు బాలెనో కార్లను అభివృద్ది చేసిన హార్టెక్ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ మీద సెకండ్ జనరేషన్ ఎర్టిగా ఎంపీని నిర్మించారు.  

2. హ్యుందాయ్ శాంట్రో
ఇటీవల కాలంలో పలు కొత్త కంపెనీలు... మరెన్నో కొత్త కార్లు అందుబాటులోకి వచ్చాయి... కానీ ఓ ఇరవైయేళ్ల వెనక్కి వెళితే హ్యుందాయ్ శాంట్రో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఆశించిన అమ్మకాలు సాధించలేదనే కారణంతో శాంట్రో కారును మార్కెట్ నుండి తొలగించిన హ్యుందాయ్ సంస్థ, దీనికి ఉన్న డిమాండ్ మరియు ప్రజాదరణ కారణంగా మళ్లీ రీలాంచ్ చేసింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 30,000 పైగా బుకింగ్స్ సాధించింది.

1. మారుతి సుజుకి స్విఫ్ట్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ యేడు విపణిలోకి సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ థర్డ్ జనరేషన్ కారును విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్లతో వచ్చిన మూడవ తరం మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు అనతి కాలంలోనే భారీ విజయాన్ని అందుకొంది. భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన మారుతి స్విఫ్ట్ ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2018 (ICOTY 2018) అవార్డును కూడా దక్కించుకుంది.