అలెర్ట్: రైతులు జాగ్రత్తలు
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 27వ తేదీ నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఆతదుపరి రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా కాశిపాడు 29.5మిమీ, విజయవాడ తూర్పులో 25.5మిమీ, కర్నూలు జిల్లా దేవనబండలో 22.5మిమీ, విజయనగరం జిల్లా విజయరాంపురంలో 18మిమీ, కాగంలో 17మిమీ వర్షపాతం రికార్డయిందన్నారు.