PSLV-C50 Mission: నిప్పులు చిమ్మకుంటూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-50

Technology Published On : Saturday, February 6, 2021 12:00 PM

Sriharikota, December 17: ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీశ్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రంలోని ( Sriharikota) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 (PSLV-C50 Mission) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. నిజానికి ప్రయోగం పలుమార్లు వాయిదా పడి చివరికి నేడు చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభించనున్నాయి. దీని పరిమితి  భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు (Andaman and Nicobar Islands) విస్తరించనుంది.

 ఏడేళ్లపాటు సేవలందించనున్న PSLV-C50 Mission సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు సీఎంఎస్‌-01 దోహదపడనుంది. జిశాట్‌-12 స్థానాన్ని  సీఎంఎస్‌-01 శాటిలైట్‌ భర్తీ చేయనుంది. సీఎంఎస్‌ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది. షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని ఇస్రో పేర్కొంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంత దీనిని తయారుచేశారు.  

పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ హర్షం వ్యక‍్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్‌ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్‌ పేర్కొన్నారు.

రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీవీకే సొంతమని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. జనవరి 24న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్‌ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది.