Dhoni set for Poultry Farming: కోళ్ల వ్యాపారంలోకి ధోని, కడక్‌నాథ్‌ నల్ల కోళ్లు కొనుగోలు 

Sports Published On : Wednesday, December 23, 2020 12:00 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని కోళ్ల వ్యాపారంలోకి (MS Dhoni set for Poultry Farming) అడుగుపెట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. సిరులు కురిపించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘కడక్‌నాథ్‌’ పెంపకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ  పరిశ్రమను (poultry farming) నెలకొల్పేదిశగా ధోని (Mahendra Singh Dhoni) ముందుకు సాగుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ధోని బృందం ఆర్డర్‌ చేసిన 2 వేల కోడి పిల్లలు, డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం. 

ఈ మేరకు మధ్యప్రదేశ్‌ గిరిజన రైతు వినోద్‌ మెండాతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఈ విషయం గురించి మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్‌ ముర్గా రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఐఎస్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించాడని, అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.  కాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్‌ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. ప్రొటీన్ల శాతం ఎక్కువ. కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ.. అదే విధంగా ఐరన్‌ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ ఉంటుందట. ఇక ఈ కోళ్ల చర్మం, మాంసంతోపాటు రక్తం కూడా నలుగు రంగులోనే ఉండటం విశేషం. 

వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. అధిక రోగనిరోధక శక్తి గల కడక్‌నాథ్‌ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. కాగా ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైగానే ఉంటుందట. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని, ప్రస్తుతం ఐపీఎల్‌ టీం సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన ఫాంహౌజ్‌లో కుటుంబంతో సమయం గడిపే ధోని, ఇప్పుడు అక్కడే పౌల్ట్రీని నెలకొల్పనున్నాడు.