డ్రోన్ వినియోగంపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వైసీపీ..

Politics Published On : Saturday, August 17, 2019 03:50 PM

కృష్ణా నదిలో వరద ఇంకా ఉదృతమయ్యే అవకాశముందని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి హెచ్చరించారు. ఈ సంధర్భంగా కరకట్టలో డ్రోన్‌ వినియోగానికి టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంపై ఆయన ధీటుగా స్పందించారు. ప్రజలను కాపాడటానికి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికే ఇరిగేషన్ అధికారులు డ్రోన్‌ను వినియోగించారని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. అక్రమ కట్టడాన్ని సమర్థించుకోడానికే ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని,  కరకట్ట లోపల నిర్మించిన చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కాదా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు.

ముంపు వస్తుందనే ముందు జాగ్రత్తతో బాబు హైదరాబాద్‌ వెళ్లిపోయాక కూడా టీడీపీ నేతలు దిగజారిపోయి మరీ ధర్నాలు చేస్తున్నారని,  ప్రజలు అసహ్యించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముంపు కష్టాలను గాలికి వదిలేసి ఇంట్లో ఎవరూ లేని అక్రమ కట్టడం కోసం టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు అక్రమ నివాసాన్ని మర్యాదగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.