నాడు వైఎస్.. నేడు జగన్, యార్లగడ్డ కు సముచిత స్థానం .. రీజన్ ఇదేనా?

Politics Published On : Wednesday, August 14, 2019 02:09 PM

జగన్ సర్కార్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌ను అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని సమాచారం. మంగళవారం జివో 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా సంఘంలో తనతోపాటు నలుగురు సభ్యులను కూడా నియమించే అధికారాన్ని కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కల్పించారు. తెలుగు, హిందీ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఈ పదవిని ఇచ్చి సముచితంగా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. నాడు వైయస్సార్ ఏ విధంగా అయితే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమించి గౌరవించారో అదే తరహాలో నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష సంఘం చైర్మన్ గా అవకాశమిచ్చి గౌరవించారు. ఇక యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

ప్రస్తుతం ఆచార్య యార్లగడ్డ నరేంద్ర మోడీ ఛైర్మన్‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్ధలో సభ్యులుగా సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాష సాహిత్యం, సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేసిన యార్లగడ్డ వివిధ దేశాలలో తెలుగు మహాసభలను నిర్వహించారు. తెలుగు హిందీ భాషల్లో డాక్టరేట్ అందుకున్న యార్లగడ్డ కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల లో జన్మించారు. జయేంద్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జైలు జీవితాన్ని సైతం గడిపారు. దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించి ఎన్టీఆర్ కు హిందీ భాష నేర్పించాడు. చంద్రబాబు అస్తిత్వాన్ని నాటి నుండి నేటి వరకు నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉన్న యార్లగడ్డ చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారాడు.