చేరికల మాయలో వైఎస్ జగన్! ఎందుకిలా చేస్తున్నారు..!

Politics Published On : Wednesday, October 9, 2019 09:57 PM

గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుడి లక్షణం. అయితే అధికారంలోకి వచ్చాకా నేతల వివేకం ఏమవుతుందో ఎవరికీ అంతుబట్టదు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు అయినా, ఇప్పుడూ తెలంగాణలో కేసీఆర్ అయినా, ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా. నేతలను చేర్చుకోవడం విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు, ప్రదర్శిస్తూ ఉన్నారు! ఇలాంటి చేరికల వల్ల ఎంత మేరకు ఉపయోగం ఉంటుందో. గతాన్ని పరిశీలిస్తే స్పష్టం అవుతుంది! జగన్ మోహన్ రెడ్డి నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుక్కొన్నారు. చివరకు ఏమయ్యారు? రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ఆ ఎమ్మెల్యేలనే కాదు. ఇంకా బోలెడంత మంది నేతలను వైసీపీ నుంచి చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు. అంతచేసి చివరకు సాధించింది ఏమిటి? దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని, 23 మంది ఎమ్మెల్యేలనే ఆయనకు మిగిల్చి దేవుడు బుద్ధి చెప్పాడని జగన్ తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు!

మరి అలా వ్యాఖ్యానించే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఎందుకు నేతలను తెచ్చుకోవడానికి ఉబలాటపడుతూ ఉన్నారో అర్థంకాని పరిస్థితి. ఈ పరిస్థితి మరెవరిదో కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే! జగన్ ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలను కొనకపోవచ్చు, తన పార్టీలోకి చేరేవారు ఎవరైనా పదవులకు రాజీనామా చేయాల్సిందే అనే రూల్ పెట్టే ఉండవచ్చు. అవన్నీ జగన్ స్థాయిని పెంచేవే. అయితే పదవుల్లో లేరని. జూపూడి లాంటి వారిని చేర్చుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది. జూపూడి పోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం అంటుంటే, జూపూడి చేరికతో జగన్ మోహన్ రెడ్డి వైపు అదోలా చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు! జూపూడి ప్రభాకర్ రావు ప్రజానేత కాదు, అపారమైన మేధస్సు ఉన్న వ్యక్తికాదు, ఆయనకు ఒక రాజకీయ నేతగా ఎలాంటి క్వాలిటీస్ లేవు. తెలుగుదేశం పార్టీ తరఫున అనుకూల మీడియాలో కూర్చుని ఐదేళ్లపాటు జగన్ మీద అక్కసు మాటలు మాట్లాడటమే తప్ప అంతకు మించి ఆయన సాధించింది ఏమీ లేదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు జగన్ దగ్గరుండి కండువా వేయడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకే తెలియాలి!

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసులు పెట్టించి, అరెస్టు చేసి మరో మెట్టు ఎదిగిన జగన్ మోహన్ రెడ్డి, జూపూడి లాంటి అర్బక రాజకీయ నేతకు కండువా వేసి అదే మెట్టు టక్కున దిగి వచ్చాడని.. హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని వైసీపీ అధిష్టాన వర్గమే అర్థం చేసుకోవాలి. ఇలాంటి చేరికలకు ఎవరు బీజాలు వేస్తున్నారో కానీ.. వారు పార్టీకి నష్టాన్ని అయితే చేస్తున్నారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు!