డిసెంబర్‌ 31న విజయవాడ ప్రజల కల తీరుస్తాం - వైసీపీ

Politics Published On : Monday, June 17, 2019 03:56 PM

డిసెంబర్‌ 31 నాటికి విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి చేసి, విజయవాడ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందుబాటులోకి తెస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలు జారీచేశారు. ఆదివారం మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలసి విజయవాడలోని ఫ్లై ఓవర్‌ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కనకదుర్గ ఫ్లై ఓవర్‌ అత్యంత ప్రాముఖ్య మైనదన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఫ్లై ఓవర్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారని చెప్పారు.

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌ నిర్మాణం క్రమంలో నెల రోజులపాటు కింద రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వస్తుందని, కొన్ని చోట్ల దారి మల్లింపు ఉంటుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఫ్లై ఓవర్‌ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌ నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం (NHAI) నుంచి ఇప్పటి వరకు రూ. 233 కోట్లు విడుదలయ్యాయని, మరో రూ. 100 కోట్లు రావల్సి ఉందన్నారు.