వైసీపీలో మరో పవర్ సెంటర్ - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎవరీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి?

Politics Published On : Saturday, July 18, 2020 12:19 PM

వైఎస్సార్సీపీ ప్రస్ధానం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న ముగ్గురి పేర్లు తడుముకోకుండా చెప్పొచ్చు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధినేత జగన్ తర్వాత వారిదే హవా. ఒకరిద్దరు మంత్రులు కీలకంగా ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతల్లో అంతా వీరు చెప్పినట్లే సాగుతుంటుంది. పార్టీ భారాన్ని వీరే మోస్తూ వచ్చారు. అలాంటిది తాజాగా తెరవెనుక పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మరో పాత్రను జగన్ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఆయనే వీపీఆర్.

వైసీపీ తెరపై మరో పాత్ర ఎంట్రీ ఇవ్వబోతుందంటేనే ఎవరై ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. ఆ నాలుగో పాత్ర మరెవరో కాదు వీపీఆర్. పారిశ్రామికవేత్తగా, రాజ్యసభ ఎంపీగా నెల్లూరు జిల్లాకే పరిమితమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ పేరుతో ప్రసిద్ధులు. వైసీపీ ప్రస్ధానం ప్రారంభమైన నాటి నుంచి పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్నా వీపీఆర్.. తెరముందు కనిపించేది చాలా తక్కువ. విజయసాయిరెడ్డి తర్వాత జగన్ ముందు రాజ్యసభ ఎంపీ ఛాయిస్ గా నిలిచిన వీపీఆర్ కష్టకాలంలో పార్టీని అన్నివిధాలా ఆదుకున్నారు. పార్టీ రాజకీయాలే కాదు అర్ధికంగా అండగా నిలవడమే కాదు.. ఓ కీలక జోన్ లో వైసీపీకి పెద్దన్నగా వ్యవహరించారు. అందుకే ఆయన ఆ ముగ్గురి సరసన నిలబడటమే కాదు జగన్ కు ప్రీతిపాత్రుడయ్యారు.

ప్రస్తుతం కర్నూలు, ప్రకాశం జిల్లాల వైసీపీ బాధ్యతలు పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఓ దశలో జగన్ స్ధానంలో పార్టీ బాధ్యతలు ఆయనే చూసుకుంటారనే ప్రచారం జరిగింది. సీఎం అయ్యాక జగన్ బిజీ కావడంతో ఏడాది తర్వాత ఆయన స్ధానంలో పార్టీ బాధ్యతలు నమ్మకస్తుడైన సజ్జలకు అప్పగిస్తారనే వాదన మొదలైంది. అదే సమయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బాధ్యతలను ముందునుంచీ వైసీపీకి అండగా నిలిచిన ముగ్గురు నేతలకు పంచారు. ఇందులో కర్నూలు, ప్రకాశం బాధ్యతలు కూడా సజ్జలకు దక్కాయి. అయితే మరోసారి ఆయన బాధ్యతల్లో కోత పెట్టి వేమిరెడ్డిని తెరపైకి తీసుకురావడంపై చర్చ జరుగుతుతోంది.