సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యే తనయుడు

Politics Published On : Saturday, January 26, 2019 08:57 AM

తెలంగాణలో జరిగిన రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో బరిలోకి దిగిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మెయినొద్దీన్ కుమారుడు అఫ్సర్ మొయినొద్దీన్ ఓటమి పాలయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్‌లో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశం గౌడ్ చేతిలో 60 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందినా కూడా పంచాయతీ ఎన్నికల్లో కొడుకు ప్రత్యర్థి అభ్యర్థి చేతిలో పరాభావం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4310  స్థానాల్లో 2600 స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. రెండు విడతల్లో కలిపి  8300 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 5300 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1700 స్థానాల్లో విజయం సాధించారు. అంతే కాకుండా ఏకగ్రీవాలు కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.