ప్రధాని పర్యటనపై టీడీపీలో వణుకు

Politics Published On : Friday, December 28, 2018 05:06 PM

దేశ ప్రధాని ఓ రాష్ట్రంలో పర్యటనకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అంటే ఆ పర్యటన వివరాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే అందజేస్తారు. భద్రతా వ్యవహారాల నుంచి, పర్యటన వివరాల వరకూ ప్రతి అంశం రాష్ట్ర హోంశాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికారులకూ స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి మాత్రం ప్రధాని ఏపీలో ఎందుకు పర్యటిస్తున్నారో అస్సలు తెలియదట. మోదీ ఏ కారణంతో ఆంధ్రాలో అడుగుపెడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నాడాయన. పైగా ప్రధాని మర్యాద కాపాడుకోవాలంటే ఏపీలోకి అడుగుపెట్టొద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. దేశ ప్రధానికి ఓ ఎంపీ ఇస్తున్న ఈధమ్కీ వెనుక కుట్ర కోణాలు ఉన్నాయా అని దేశ ప్రజలకు అనుమానం కలుగుతోంది. 

గతంలో లా దాడులు ప్లాన్ చేసారా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అధికారం పంచుకున్న టీడీపీ రాజకీయ అనివార్యతల వల్ల ఎన్డీయే నుంచి వైదొలగింది. ఆ సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చారు. అవకాశం కోసం ఎదురు చూసిన టీడీపీ అమిత్ షా కాన్వాయి పై పార్టీ కార్యకర్తలచేతే రాళ్లు రువ్వించింది. దాడికి పాల్పడింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించకుండా ఇది కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్ల జరిగిన ఎమోషనల్ చర్య అంటూ కొట్టిపడేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడూ అదే తీరుగా ప్రధాని పర్యటనలో పార్టీ కార్యకర్తలతో దాడులను ప్లాన్ చేయిస్తున్నారా అని అనుమానిస్తున్నారు తెలుగు ప్రజానీకం. అందుకోసమే సుజనా చౌదరితో ప్రధానిని ఏపీలో పర్యటించొద్దని ముందస్తు ప్రకటనలు చేయిస్తున్నారని భావిస్తున్నారు. దాడులు జరిగితే మేము ముందే హెచ్చరించామని తప్పించుకోజూడటమే ఈ ప్రకటనల వెనుక ముఖ్యోద్దేశ్యం అంటున్నారు.