ఈ విషయంలో వైఎస్ పాలనకు, జగన్ పాలనకు తేడా లేదు.

Politics Published On : Monday, May 4, 2020 08:27 PM

రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవటం పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మాజీ మంత్రి జవహర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి రూ.3వేల కోట్ల ఆదాయాన్ని రూ.30వేల కోట్లకు పెంచారని బెల్ట్ షాపులను వైఎస్ పెంచి పోషించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వైఎస్ పాలనకు జగన్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. మద్య నిషేధం చేస్తానని జగన్ మ్యానిఫెస్టోలో హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా రేట్లు పెంచారన్నారు. రాష్ట్రంలో నాటు సారా ఏ విధంగా ఏరులై పారుతోందని మండిపడ్డారు. 

వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే గంజాయి, నాటుసారా పంపిణీ జరుగుతున్నా జగన్ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులు మద్యాన్ని, వాలంటీర్లు నాటుసారా అమ్ముకుంటున్నారని జవహర్ ఆరోపించారు. లాక్‌డౌన్ ముందు నుంచి ఉన్న మద్యం నిల్వలు ఇప్పుడున్న మద్యం నిల్వల లెక్క తేల్చాలని, దానిపైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులకు హారతులిచ్చి తెరవడం జగన్ పాలనలోనే సాధ్యం అవుతుందని దుయ్యబట్టారు. ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.