కేశినేని నానీతో గల్లా జయదేవ్ భేటీ, బుజ్జగించే యత్నం మొదలుపెట్టిన చంద్రబాబు..!

Politics Published On : Wednesday, June 5, 2019 03:36 PM

ఏపీలో టీడీపీ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నానీని బుజ్జగించటానికి అధిష్టానం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ రంగంలోకి దించింది. ఇద్దరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు, పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్‌దేవ్‌ను , అలాగే లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడిని, పార్టీ విప్‌గా కేశినేని నానిని నియమించిన విషయం మనకి తెలిసిందే. అయితే దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని తెలియచేసారు.

ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని తెలియచేసారు. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాంటూ సూచించడం టీడీపీ పార్టీలో కలకలం రేపింది. ఇక కేశినేని మీడియాతో మాట్లాడుతూ తన ప్రకటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. విజయవాడ ఎంపీ కంటే తనకు మరో పెద్ద పదవి లేదని వ్యాఖ్యానించారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన హామీలపై విజయవాడ ఎంపీగానే పోరాడానని స్పష్టం చేశారు.