అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే....

Politics Published On : Wednesday, December 5, 2018 03:35 PM

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు దోస్తీ కట్టడం వెనక ఆంతర్యం ఉన్నట్లే  కనిపిస్తోంది.  కర్ణాటకలో మాదిరిగా  ముఖ్యమంత్రి కావచ్చుననే మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాటల్లోని ఆంతర్యం ద్వారా అర్థమవుతోంది. లగడపాటి రాజగోపాల్  బయటపెట్టిన సర్వే  వివరాలు, దానికి కౌంటర్ గా  కేటీఆర్  చేసిన ట్వీట్ ఆ విషయాలను తెలియజేస్తున్నాయి. 

లగడపాటి మొదటి సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 65 నుంచి 70 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 60 సీట్లు అవసరం. అంటే, టీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ లభిస్తుందనే విషయాన్ని లగడపాటి తొలి సర్వే బయటపెట్టింది. ఒక వేళ సర్వే ఫలితాలు కొంచెం అటూ ఇటూ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కూడగట్టుకోవడానికి కేసీఆర్ అసదుద్దీన్ తో దోస్తీ కట్టారనేది అర్థం చేసుకోవచ్చు. మజ్లీస్ కచ్చితంగా 7 సీట్లు గెలుచకుంటుందనేది అందరూ నమ్ముతున్నారు. మజ్లీస్ సభ్యులు ఏడుగురి మద్దతు తమకు లభిస్తే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆలోచించిస్తున్నారు.  మైనారిటీ ఓట్లు పొందడానికి ఆ దోస్తీ పనికి వస్తుందని కూడా భావిస్తున్నారు.