కేసీఆర్-జగన్ భేటీ: భయం గుప్పిట్లో బాబు...!!

Politics Published On : Saturday, May 25, 2019 01:18 PM
ఏపీలో బంపర్ మెజార్టీతో భారీ విజయం సాధించిన జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10.30కు తాడేపల్లిలో ఉన్న జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం (YCLP) జరిగింది. ఈ సమావేశంలో జగన్‌ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. తర్వాత మధ్యాహ్నం జగన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ సీఎంను కలవనున్నారు జగన్. రాజ్‌భవన్‌ నుంచి నేరుగా ప్రగతి భవన్‌ వెళ్లి కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ విజయంతో పాటు, భవిష్యత్ ప్రణాళికలు, ఇరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా, గతంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణలో నమోదైన ఓటు నోటు వంటి కేసులను బయటకులాగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భయం గుప్పిట్లో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.