జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉంది..

Politics Published On : Tuesday, June 25, 2019 01:38 PM

ప్రజావేదిక భవనం కూలగొట్టడం తుగ్లక్ చర్య అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వచ్చిన అధికారాన్ని నిర్మాణానికి వినియోగించండి, వీటిని కూలిస్తే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసినవాళ్లు అవుతారని జగన్ ను హెచ్చరించారు. ప్రజా వేదిక అనేది అన్నివర్గాల ప్రజల వేదిక అని, అందుకే దానిని నిర్మించామని అన్నారు, ప్రజోపయోగమైన వేదికను కూలగొట్టమనడం తుగ్లక్ చర్య. ఇలాంటి నిర్ణయాలతో సియం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్  పాలనను గుర్తు తెచ్చారు అని యనమల అన్నారు.

రాష్ట్ర నిర్మాణం కోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అంతే తప్ప కూలగొట్టమని కాదు మీకు ఓట్లు వేసింది. కొత్త భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టకుండా ఉన్నవాటిని కూలగొట్టటం సరైన చర్య కాదు. ప్రజావేదిక కూలగొట్టాలనే నిర్ణయాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతలు తెలుస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమంపై దృష్టి కన్నా విధ్వంసంపైన ద్రుష్టి పెట్టడం దురదృష్టం.ఈ విధమైన చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనం. వున్న నిర్మాణాలను సక్రమంగా వినియోగించుకుని కొత్త నిర్మాణాలు నిర్మించాలి. అంతే తప్ప ఉన్నవాటిని కూలగొట్టడం తుగ్లక్ చర్యకాక ఏమనాలి? నెల రోజుల పాలనలోనే ఈ విధమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాబోయే కాలంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరెన్ని చేపడతారో అనే భావన సర్వత్రా ఉంది అన్నారు యనమల.