రైతు భరోసాపై మాటమార్చిన సిఎం జగన్..

Politics Published On : Wednesday, September 18, 2019 12:26 PM

వైసీపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట మార్చారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం విమర్శించింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.కేశవరావు, పి.పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మంగళవరం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రణాళికలో రైతులకు పెట్టుబడిసాయం కోసం రూ.12,500 ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని, అది కూడా అక్టోబరు నుండి ఇస్తామని విధివిధానాలు కూడా ఇచ్చారన్నారు. అందులో కేంద్రం ఇస్తామన్న ఆరువేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6500 కలిపి ఇస్తామని చెబుతోందని, ఇది మాట మార్చడమేనని తెలిపారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే రూ.12,500 ఇవ్వాలని వారు డిమాండు చేశారు. వాస్తవ కౌలు రైతులను ప్రభుత్వమే గుర్తించి పెట్టుబడిసాయం ఇవ్వాలని కోరారు. పనికిరాని భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడిసాయం పథకాన్ని వర్తింపచేయాలనీ అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.