రైతులకి ఇచ్చిన మరో మాట నిలబెట్టుకున్న జగన్..!

Politics Published On : Tuesday, June 11, 2019 02:30 PM

రైతన్నల విద్యుత్‌ కష్టాలు తీరబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవసాయానికి పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్‌ అందించడానికి సిద్ధమయ్యారు. ఎప్పటి నుంచి తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వగలమో ఆ తేదీని ఖరారు చేయాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం సంబంధిత అధికారులని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నేతృత్వంలో ఈ అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఈ నెల 13న పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఆడించే తేదీని ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలు (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) మినహా అన్ని జిల్లాల్లోనూ దఫాల వారీగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. పగలు కంటే రాత్రే ఎక్కువగా విద్యుత్‌ ఇస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరికే సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. వ్యవసాయ క్షేత్రాలను సమగ్రంగా తడుపుకోలేని దుస్థితి ఉంది. రాత్రిపూట కరెంటు ఇస్తుండటంతో రైతులు నిద్ర మానుకుని పొలాల్లో కాపు కాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో చీకట్లో విష పురుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది చీకట్లో అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్‌ తీగల వల్ల కరెంట్‌ షాకుకు గురై మరణిస్తున్నారు. దీన్ని పూర్తిగా మార్చాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.