ప్రకాశం టీడీపీ ఆధిపత్య పోరు- వైసీపీలో చేరేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల ప్రయత్నం- చివరికి ఏం జరిగిందంటే,.

Politics Published On : Tuesday, March 17, 2020 01:26 PM

ప్రకాశం జిల్లా రాజకీయాలు తలపండిన వారికి సైతం ఓ పట్టాన అర్ధం కావు. ఎవరు ఏ పార్టీలో ఎందుకు ఉంటారో, ఎందుకు తిరిగి ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తారో, మళ్లీ రాష్ట్రంలో అధికారం మారాక తిరిగి మళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వస్తారో తెలియని పరిస్ధితి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్ వైసీపీలోకి ఫిరాయించేందుకు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో జరిగిన మార్పులతో ఒకరికి మోదం, మరొకరికి ఖేదం మిగిలింది. దీంతో ఇప్పుడు ప్రకాశం రాజకీయాల్లో తాజా పరిణామాలకు కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

వీరిద్దరూ స్ధానిక ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కరణం బలరాంను వైసీపీలోకి తీసుకునేందుకు సిద్దమైన జగన్, గొట్టిపాటి విషయంలో మాత్రం నో చెప్పేశారు. గతంలో తమ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో ఫిరాయించిన గొట్టిపాటి ఇప్పుడు తన అవసరాల కోసం వైసీపీలోకి వస్తానంటే ఎలా తీసుకుంటామనే జగన్ ప్రశ్నకు పార్టీ నేతల వద్ద సమాధానం లేదు. దీంతో గొట్టిపాటి టీడీపీలోనే ఉండిపోగా, కరణం మాత్రం వైసీపీలోకి తన వర్గాన్ని ఫిరాయించి తాను మాత్రం ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు.