సచివాలయ ఉద్యోగులకి ఎంసెట్ తరహా నిబంధన తో ఆందోళన చెందుతున్న అభ్యర్థులు..!

Politics Published On : Sunday, August 25, 2019 10:14 AM

గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ నెలలో నిర్వహించే పరీక్షలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త నిబంధనని తెచ్చింది అది ఏమిటంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు, పరీక్ష అయ్యే వరకూ బయటకు వెళ్లనివ్వరు, సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి పరికరాలను అనుమతించకపోవడం వంటి పటిష్ఠ నిబంధనలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యం, అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఆయా జిల్లాల్లో మంజూరైన పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, పట్టణాభివృద్ధిశాఖలు పర్యవేక్షిస్తున్నాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఈ పరీక్షల నిర్వహణ కమిటీకి చైర్మన్‌ కాగా ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్లు వైస్‌ చైర్మన్లుగా, జడ్పీ సీఈవో సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇలా కమిటి వల్ల అవినీతి జరగకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ, వీడియో కవరేజ్‌లను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టికెట్లను ఈ రోజు ఆగష్టు 25(ఆదివారం) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పంచాయతిరాజ్‌ శాఖ ప్రకటించింది.