Tirupati LokSabha Bypoll: తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ

Politics Published On : Saturday, December 26, 2020 03:00 PM

Amaravat, Nov 16: తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ రావు మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌‌సభ ఉప ఎన్నికకు ముందుగానే టీడీపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వెల్లడించారు.

తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలంటూ వీడియో కాన్ఫరెన్స్‌లో నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో లోక్‌సభ మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం చేశారు. 

తక్షణం కమిటీలు పని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన చంద్రబాబుకు పనబాక లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.  2019 ఎన్నికల్లో పనబాక లక్ష్మీ టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

ఇప్పటికే తిరుపతిలో తమ సత్తా చాటుతామంటూ బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో గెలిచినట్టుగా తిరుపతిలో కూడా గెలుస్తామంటూ ఏపీ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబానికే టికెట్ ఇస్తుందా? లేక వేరే అభ్యర్థిని నిలబెడుతుందా అనేది త్వరలో తేలనుంది.