సమస్యల వలయంలో జగన్ సర్కార్.. ముంచుకొస్తున్న మరో సమస్య..

Politics Published On : Thursday, March 19, 2020 10:09 AM

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారతాయా, కీలక సమస్యల పరిష్కారం చేయకుండా రాజధాని తరలింపు సాధ్యమేనా, మండలి రద్దు కాకుంటే మేలోపు విశాఖకు వెళ్లడం అయ్యే పనేనా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం కావడమొక్కటే జగన్ సర్కారుకు ఊరటగా కనిపిస్తోంది.ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పేరుతో పెండింగ్ లో పెట్టిన శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ కేంద్రానికి తీర్మానం చేసి పంపింది.

అయితే ఇంతవరకూ దాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని, ఆ మేరకు అమిత్ షా హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నా ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు. కాబట్టి మండలి రద్దు వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి నెలకొంది. దీనిపై కేంద్రం వద్ద లాబీయింగ్ చేయాలన్నా సీఎం జగన్ రాష్ట్రంలో మిగతా పరిస్ధితులపైనే దృష్టిపెట్టాల్సిన పరిస్ధితులు ఉన్నాయి.ఏపీ సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కార్యాలయాలను రెండింటిని కర్నూలుకు తరలిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఇచ్చిన ఆదేశాలు సైతం వివాదాస్పదమయ్యాయి. వీటిపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు విచారణ జరిపినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు.