సీఎం జగన్‌పై నిమ్మగడ్డ బాంబు, ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ, వైసీపీపై సంచలన ఆరోపణలు,

Politics Published On : Wednesday, March 18, 2020 09:13 PM

చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నాకు, నా కుటుంబీకులకు ప్రాణహాని ఉంది. మాపై దాడి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో నేను అమరావతిలో ఉండి పని చేయలేను. హైదరాబాద్ లో ఉండేందుకు అనుమతివ్వండి. లేదా కేంద్రం నుంచి భద్రతా బలగాలను పంపండి. నిజానికి ఏపీలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు అంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి మొరపెట్టుకున్నారు.

తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతోపాటు అసలు ఏపీలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవన్న చివరి వాక్యం దాకా ఎస్ఈసీ రమేశ్ తన లేఖలో అన్నీ సంచలన అంశాలే ప్రస్తావించారు. సుదీర్ఘంగా ఐదు పేజీల్లో ఏపీకి సంబంధించిన అన్ని వివరాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. నామినేషన్ల ప్రక్రియలో దాడులు, బలవంతపు ఏకగ్రీవాలను హైలైట్ చేసిన కమిషనర్. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతూ పట్టుబడితే సభ్యత్వం రద్దు చేస్తామన్న వైసీపీ కొత్త చట్టాన్ని కూడా లేఖలో తప్పు పట్టడం గమనార్హం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో,. బుధవారం నాటి ఎస్ఈసీ లేఖలోనూ దాదాపు అవే అంశాలు ఉండటం గమనార్హం. ఏపీలో ఎన్నికల్ని కేంద్రమే నిర్వహించాలని, బలగాలను మోహరింపజేయాలని టీడీపీ మొదటి నుంచీ వాదిస్తున్నది. వాయిదా విషయంలో వైసీపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, కమిషనర్ నిర్ణయాలను కోర్టు సమర్థించడంతో టీడీపీ సంబురాలు చేసుకున్నట్లు సమాచారం.