లగడపాటికి సీఎం జగన్ ఝలక్..!

Politics Published On : Tuesday, June 4, 2019 12:15 PM

పాలనపై దృష్టిసారిస్తున్న నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక అంశాలపై కూపీ లాగుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన వైయస్ జగన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న మెడ్ టెక్ జోన్ ఏర్పాటుపై కూడా ఆరా తీశారు. గతంలోనే మెడ్ టెక్ జోన్‌పై ఆరోపణలతో ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ప్రాజెక్టు ఇదేనా అంటూ వైయస్ జగన్ ఆరా తీసినట్టు సమాచారం.

అంతేకాదు మెడ్ టెక్ జోన్‌పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పూనం మాలకొండయ్యను ఆదేశించారు జగన్. గతంలో మెడ్ టెక్ జోన్ టెండర్ల విషయంలో వందల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడ్ టెక్ జోన్ టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ గతంలోనే వైసీపీ ఆరోపించింది. దీంతో అప్పట్లో ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కనపెట్టింది. తాజాగా దీనిపై ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టడంతో లగడపాటికి ఝలక్ ఇవ్వడానికి ఆయన డిసైడయ్యారనే టాక్ వినిపిస్తోంది.