మనోహర్ పారికర్ రాజకీయ ప్రస్థానం..!

Politics Published On : Monday, March 18, 2019 10:15 AM

1955లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పారికర్ ఆరెస్సెస్ ప్రచారక్‌గా తన రాజకీయ జీవితాన్నిమొదలుపెట్టారు. ఐఐటీ-బొంబాయిలో మెటలర్జికల్ ఇంజినీర్‌గా పట్టభద్రులైన పారికర్ సంఘ్ పరివార్ కోసం పనిచేశారు. నేను ఆరెస్సెస్ ప్రచారక్‌నని ఆయన బహిరంగంగానే చెప్పుకునేవారు. పారికర్ రక్షణమంత్రిగా ఉన్నప్పుడు.. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పలుమార్లు దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ప్రేరణ ఆరెస్సెస్‌లో తాను విన్న బోధనలేనని ఆయన అప్పట్లో తెలిపారు. గోవాలో ఎంజీపీ (మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ) అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతున్న క్రమంలో.. దానిని అడ్డుకునేందుకే బీజేపీ పారికర్‌ను రంగంలోకి దించింది.

1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన పారికర్ గోవా రాజధాని పనాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999లో జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలల పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన పారికర్ తన ఉపన్యాసాలతో మంచి పేరు సంపాదించారు. 2000 అక్టోబర్ 24న ఆయన తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ రెండేండ్లకే (2002, ఫిబ్రవరి)లో సీఎం గద్దె దిగాల్సి వచ్చింది. 2002, జూన్ 5న పారికర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ 2005, జనవరి 29న నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 2007లో దిగంబర్ కామత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ని పారికర్ నాయకత్వంలోని బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

కానీ 2012నాటికి ప్రజాదరణను బాగా పెంచుకున్న పారికర్, బీజేపీ సొంతంగా 21 సీట్లు (మొత్తం సీట్లు 40) గెలుచుకునేందుకు ముఖ్యపాత్రా పోషించారు, మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి రెండు సీట్లు సాధించి పెట్టారు. కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడిన తర్వాత పారికర్ సీఎం పదవిని వదిలేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017 వరకు ఆయన రక్షణమంత్రిగా పనిచేశారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోలేకపోవడంతో మిత్రులను కూడకట్టటానికి పారికర్ మళ్లీ తన సొంత రాష్ర్టానికి వచ్చి సీఎంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఆయన తన తుది శ్వాస విడిచే వరకూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారు.