ఏపీ సచివాలయ ఉద్యోగాలకు వీరు అనర్హులు..!

Politics Published On : Tuesday, August 13, 2019 12:58 PM

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దాదాపు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా రెండు లక్షల దరఖాస్తులు రాగా, విజయనగరం జిల్లా నుంచి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీరికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2, 5వ తేదీలను సెలవు దినములగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తుకు తొలుత శనివారం రాత్రి వరకు గడువు ఉండగా, గడువుని ఆదివారం రాత్రి వరకు పొడిగించటంతో మరో అరవై వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దరఖాస్తు పీజు చెల్లించిన వారికి మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. 22.69 లక్షల మందికి దరఖాస్తు చేసుకోగా అందులో 21.69 లక్షల మంది మాత్రమే దరఖాస్తు పీజు చెల్లించారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ధ్రువీకరణ పత్రం లేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా వారికి హాల్ టిక్కెట్లు జారీ చేసే అవకాశం లేదు.

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలోచదువుకొని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక ధ్రువీకరణ పత్రం అధికారికంగా పొందిన వారు రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. రాత పరీక్ష కోసం 8వేలకు పైగా పరీక్షా కేంద్రాలను, 50 వేలకు పైగా గదులను సిద్ధం చేస్తున్నారు. 16 మంది, 24 మంది, 48 మంది అభ్యర్థులకు ఓ గది చొప్పున పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 13 జిల్లాల్లోని తాలుకా, మండల కేంద్రాల్లో కలిపి ఉదయం కొందరికి, మధ్యాహ్నం కొంతమందికి రాత పరీక్ష నిర్వహిస్తారు.