Wedding in Covid Centre: వధువుకు కరోనా.. కోవిడ్ కేర్ సెంటర్‌లో తాళి కట్టిన వరుడు

Offbeat Published On : Wednesday, January 20, 2021 09:15 PM

Jaipur, December 7: కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. చాలామంది పెళ్లి ఆలోచనే ఎత్తలేదనే చెప్పాలి. మరికొందరు మాత్రం అత్యంత తక్కువ మందితో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. సెలబ్రిటీలు అయితే కుటుంబ సభ్యుల మధ్యలో అతిథులు లేకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే రాజస్థాన్ లో ఓ పెళ్లి మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. వధువుకు కరోనా రావడంతో పెళ్లి వాయిదా వేయలేని వరుడు కోవిడ్ సెంటర్ లో (Wedding in Covid Centre) వధువు మెడలో తాళి కట్టేశాడు.  రాజస్తాన్‌ కెల్వారా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో (Rajasthan Couple Married at Kelwara Covid Centre) ఈ వివాహ వేడుకు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

పెళ్లి వివరాల్లో కెళితే.. రాజస్తాన్‌కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో కరోనా కేర్‌ సెంటర్‌లో జాయిన్‌ చేశారు. విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక ముందుగా అనుకున్న ముహుర్తానికే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. వధువు, వరుడు, పూజారితో పాటు మరోక వ్యక్తి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వధువుకు కరోనా సోకడంతో ఆమెతో పాటు, పెళ్లి కుమారుడి, పూజారి, మరో వ్యక్తి నలుగురు పీపీఈ కిట్లు ధరించారు. 

ఇక వరుడు ఫేస్‌ షీల్డ్‌ కూడా ధరించాడు. పూజారి చెప్పిన విధంగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతు ఆచరించారు. మూడ ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. పీపీఈ కిట్లు ధరించి.. కోవిడ్‌ నియమాలు పాటిస్తూ.. జరిగిన ఈ వేడుక నెజినులను ఆకట్టుకుంది. కొత్త జంటను నెటిజనులు ఆశీర్వదించడమే కాక ప్రశంసిస్తున్నారు .