కత్తితో పొడిచి చంపేశారు.. వివేకానంద రెడ్డిది హత్యే!

News Published On : Friday, March 15, 2019 04:46 PM

దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి  సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో తేలింది. ఆయన మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ఇవాళ ఉదయం ఆయన బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దీంతో ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానంద రెడ్డి తల, చేతికి బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆయన ఒంటిపై మొత్తం ఏడు కత్తి పోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. నుదుటిపై లోతైన రెండు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తల వెనుక భాగంలో మరో గాయం ఉన్నట్లు తేల్చారు. తొడ, ఛాతి భాగంలో కూడా గాయాలు ఉన్నాయన్నారు అధికారులు.  

రక్తపు మడుగులో వివేకా బాత్‌రూంలో పడి ఉండటం చూసి ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయన డెడ్ బాడీని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. రిపోర్ట్ రావడంతో ఆయనది సహజ మరణం కాదు హత్యేనని తేల్చారు. మృతదేహాన్ని ఇంటికి తరలించి ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. శనివారం వైఎస్ వివేకా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో పులివెందులకు చేరుకోనున్నట్లు సమాచారం.

వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయన మృతి వెనుక ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఈ బృందానిరి సీఐడీ ఛీఫ్ అమిత్ గార్గ్ నేతృత్వం వహిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 302 క్రింద హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.