తండ్రి పాలనను గుర్తు చేస్తూ అధికారులకు షాకిచ్చిన జగన్

News Published On : Wednesday, June 26, 2019 10:03 AM

ఏపీ సీఎం జగన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక  తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. అధికారులతో వ్యవహరించిన తీరు వైఎస్‌ను గుర్తుకు తెచ్చింది. ప్రతీ సోమవారం కలెక్టరేట్లు సహా ప్రతీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై 'స్పందన' పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్ల సమావేశంలో జగన్ అధికారులను ఆదేశించాలి. విశ్వసనీయత అన్న పదాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు ఉన్నాయని, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ చెప్పగా.. కలెక్టర్లు వెళ్లి అక్కడ పడుకుంటారని జగన్ సమాధానం ఇచ్చారు.

పరోక్షంగా రాత్రిళ్లు అక్కడ బస చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కలగజేసుకొని ఈ విషయంలో అధికారులు తమకు సహకరించాలని కోరారు. సీఎం స్పందిస్తూ.. మనమేదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు సహకరించాలని అంటావేంటి శీను.. మనమంతా ఒక్కటేనన్నారు.  రాష్ట్రంలో ఇంటి స్థలం లేని కుటుంబం ఉండకూడదని జగన్ అధికారులను ఆదేశించారు. ఉగాది రోజు 25లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పట్టా ఇచ్చి ప్లాట్ ఎక్కడుందో కూడా చూపించాలన్నారు. అంతే తప్ప పట్టా ఇచ్చాక ప్లాట్ వెతుక్కునే పరిస్థితి ఉండకూడదన్నారు.