కరెంట్ మీటర్లకు ముందస్తు రీఛార్జ్: బ్యాలన్స్ ఉంటేనే కరెంట్!

News Published On : Wednesday, January 30, 2019 06:02 PM

విద్యుత్ ఆదా చేయడం మరియు మొండి బకాయిలను అరికట్టేందుకు కేంద్రం మరో సరికొత్త పద్దతిని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందుకు ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. అంటే ఈ మీటర్లకు ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి, ప్రతి రోజూ విద్యుత్ వాడకాన్ని బట్టి ఏరోజురారోజు మీటర్ల మనం రీఛార్జ్ చేసిన డబ్బు తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ముందస్తు రీఛార్జ్ చేసుకోకపోతే అంధకారంలో గడపాల్సిందే. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా... ఇక మీదట మీ విద్యుత్ మీటర్‌లో ఎంత డబ్బు ఉంటే అంత విద్యుత్ అన్నమాట.

ప్రస్తుతమున్న పద్దతి ప్రకారం నెల రోజుల పాటు మనం వాడుకునే విద్యుత్తును మీటర్లు యూనిట్ల రూపంలో లెక్కిస్తాయి, నెల రోజుల తర్వాత మనం వాడుకున్న కరెంటుకు బిల్లును ఇస్తారు. గడువు తేదీలోగా ఆ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్దతిలో వినియోగదారులు చాలా వరకు విద్యుత్‌ను ఆదా చేయలేకపోతున్నారు, అదే విధంగా విద్యుత్ సరఫరా సంస్థలకు మొండి బకాయిల భారం ఎక్కువవుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ముందస్తుగా తమ మీటర్లకు రీఛార్జ్ చేసుకుంటే కరెంటు ఉంటుంది... లేదంటే కరెంట్ సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీంతో వినియోగదారులు విద్యుత్ ఆదా మీద కూడా దృష్టిసారిస్తారనేది కేంద్రం అభిప్రాయం.

మన ఫోన్‌లో డబ్బు ఉంటే కాల్స్ వెళతాయి... లేకపోతే కాల్స్ చేయలేం. ఇదే పద్దతిలో మన మీటర్లో డబ్బు ఉంటే కరెంట్ సరఫరా ఉంటుంది, లేదంటే కరెంట్ సరఫరా ఉండదు. ఈ విధానాన్ని దశల వారీగా 2022 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం సింగల్ ఫేజ్ మీటర్ ధర రూ. 750 మరియు 3-ఫేజ్ మీటర్ ధర రూ. 1500 వరకు ఉంది. కానీ వీటి స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలంటే సింగల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ ధర రూ. 3 వేలు మరియు 3-ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ ధర రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అధిక మొత్తంలో కొనుగోలు చేస్తే తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయని డిస్కం కంపెనీల అంచనా.

తొలుత నెలకు 500 యూనిట్ల విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తరువాత దశలో నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడే మీటర్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తెలంగాణలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1.17 విద్యుత్ కలెక్షన్ ఉన్నాయి. వీటన్నింటికీ ప్రీపెయిడ్ మీటర్లను ప్రారంభించాలంటే సుమారుగా రూ. 4 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో 60 శాతానికి తగ్గకుండా కేంద్రం భరించాలనే డిస్కం సంస్థలు కేంద్రాన్ని కోరాయి. 

ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు అనంతరం వినియోగదారులు ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే ఈ మొత్తంలో 5 నుండి 10 శాతం వరకు రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. మొదటగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ముందస్తు రీఛార్జీ పద్దతి మంచిదే అయినప్పటికీ 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే కుటుంబాలకు ఈ మీటర్లను తప్పనిసరి చేస్తే చాలా వరకు ఇళ్లు అంధకారమవుతాయనే విమర్శలు ఉన్నాయి.