పహల్గాం ఉగ్రదాడి వెనకున్న దుర్మార్గుడు ఇతడే..
పహల్గాం ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పింది. ఈసారి అంతకు మించి చేయాలని భావిస్తోంది.
పహల్గాం ఉగ్రకుట్రకు సూత్రధారి ఎవరు అన్నదానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిఘా వర్గాల విచారణలో పహల్గాం ఉగ్ర దాడి వెనుక 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్లు గుర్తించాయి. హఫీజ్ సయూద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అప్పుడు ముంబై ఉగ్రదాడి ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి అతడి ప్రణాళికతోనే జరిగిందని నిఘా వర్గాలు తేల్చేశాయి. ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరగిన వెంటనే ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి తామే చేశామని ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థకు హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి పక్కా ప్రణాళిక ప్రకారమే పహల్గాం దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి మద్దతు ఉంటుంది. ఈ సంస్థలకు పాకిస్థాన్ ప్రభుత్వం అన్నిరకాలుగా సలహాలు, సూచనలు, మద్దతు ఇస్తుంటుంది. దీంతో ఈ రెండు ఉగ్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం తుదముట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.