యజమాని కోసం ప్రాణాలు వదిలిన శునకం, కన్నీరుమున్నీరైన కుటుంబం..

News Published On : Monday, April 13, 2020 10:24 AM

శునకం అంటేనే విశ్వాసానికి మారు పేరుగా మనం పరిగణిస్తాం. చాలామంది పెంపుడు శునకాలతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. అవి కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. రాత్రిపూట ఇంటి గేటు వద్ద ఏ చిన్న అలికిడి అయిన వెంటనే యజమానిని అప్రమత్తం చేస్తాయి. ఒకవేళ రాత్రి వేళ యజమాని బయటకి వెళాల్సివచ్చిన పెంపుడు శునకం కూడా వెంటే బయలుదేరుతుంది. దారి పొడవునా వీధి కుక్కలను నిలువరిస్తూ తిరిగి ఇల్లు చేరేదాక యజమానికి ఏ ఆపద రాకుండా చూసుకుంటుంది.

వివరాలలోకి వెళితే యజమానికి కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన కిశోర్ అనే వ్యక్తి  చాలాకాలంగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. శునకాన్ని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా చూసుకునేవాడు. అలాంటి శునకం శనివారం రాత్రి పాము కాటుకు బలైపోయింది. యజమాని ప్రాణాలను రక్షించేందుకు పాముతో చివరిదాకా పోరాడిన ఆ శునకం చివరకు ప్రాణాలు వదిలింది. శనివారం సాయంత్రం కిశోర్ తన ఇంటిలోని వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో ఓ తాచు పాము అతని మంచం కిందకు దూరడాన్ని పెంపుడు శునకం గమనించింది. వెంటనే కిశోర్ గదిలోకి వచ్చి గట్టిగా అరవడంతో నిద్ర లేచిన కిశోర్ మంచం కింద పామును చూసి షాక్ తిన్నాడు. యజమానిని రక్షించేందుకు ఆ పామును శునకం నోట కరిచి బయటకు లాక్కెళ్లింది. అనంతరం కిశోర్ ఓ కర్రతో పామును కొట్టి చంపాడు. అయితే శునకం పామును నోట కరిచిన సమయంలోనే అది దాన్ని కాటువేసింది. ఆ కాటుకి శునకం బలి అయింది.