తల్లికి వందనంపై బిగ్ అప్డేట్
ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలలో 'తల్లికి వందనం' పథకం కూడా ఒకటి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా తాజాగా తల్లికి వందనం ప్రారంభించేందు రెడీ అయింది. మే నెలలో 'తల్లికి వందనం' ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తిస్తుందని ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి చెరో రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఈ మొత్తం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30,000, ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45,000 వరకు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 69.16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం పొందే విద్యార్థులు కనీస హాజరు కలిగి ఉండాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి అర్హతలలో 75 శాతం హాజరు నిబంధన ఉండేంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించే అవకాశం ఉంది. ఈ నిబంధన పాటించని విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడెలైన్స్ ప్రభుత్వం త్వరలో ఖరారు చేయాల్సి ఉంది. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద అందించే మొత్తం రూ.15,000ను ఒకేసారి అందించాలా? లేదా రూ.7,500 చొప్పున రెండు విడతలుగా అందించాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.