ఆర్టీసీలో సమ్మె సైరన్..!

News Published On : Wednesday, January 23, 2019 04:51 PM

ఆర్టీసీలోని 52వేల మంది కార్మికులకు 2017 ఏప్రిల్ 1న వేతన సవరణ చేయాల్సి ఉంది. సుమారుగా 21 నెలలుగా జాప్యం చేస్తున్న యాజమాన్యం గుర్తింపు సంఘమైన ఎన్ఎంయూ ఒత్తిడితో 19 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఎంప్లాయిస్ యూనియన్ నేతలతో చర్చలు జరిపినా ఓ కొలిక్కిరాలేదు. గత ఏడాది డిసెంబర్ 31న ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. పలు దఫాలుగా జరుగుతున్న చర్చలు మంగళవారం మరోసారి జరిగాయి. 15 నుంచి 20 శాతం ఫిట్‌మెంట్‌కు యాజమాన్యం ప్రతిపాదించింది. 

ఆర్ధిక ఇబ్బందులు, డీజిల్ ధరల పెరుగుదల, ప్రస్తుతం ఉన్న అప్పులకు వడ్డీలతో సహా అన్నీ కలిపి సుమారుగా రూ. 3,720 కోట్లు ఆర్టీసికి అవసరమని ఎండీ సురేంద్రబాబు తెలిపారు. సంస్థ నష్టాలకు కార్మికులు కారణం కాదని, కానీ ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని నేతలు పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైనందున యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో సమ్మెబాట పట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.