ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

News Published On : Wednesday, October 23, 2019 03:00 PM

ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రపంచ దృష్టి దినోత్సవం(అక్టోబర్ 10) సందర్భంగా ‘వైయస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌ వేదికగా బుధవారం ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టునున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తారు. కంటి పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలనూ ప్రభుత్వమే ఉచితంగా చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. మొత్తం ఆరు దశల్లో మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం అమలుకానుంది.

తొలిదశలో భాగంగా అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు రెండోదశలో వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతారు. అన్ని పీహెచ్‌సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్‌ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.