జగన్‌ చాంబర్‌లోకి మ‌ళ్లీ వర్షపు నీరు

News Published On : Monday, December 17, 2018 07:26 PM

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తాత్కాలిక భవనాల డొల్లతనం మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. పెథాయ్ తుపాన్ కార‌ణంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ చాంబ‌ర్‌లోకి మ‌ళ్లీ వ‌ర్షం నీరు వ‌చ్చి చేరింది.   ఈ ఏడాది మే నెల‌లో కురిసిన చిన్నపాటి వర్షానికే.. అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్, ఇతర అధికారులు  అగ్ని మాపక శకటంతో అసెంబ్లీ తాత్కాలిక భవనంలో తనిఖీలు నిర్వహించారు. 

తనిఖీలు జరిగే సమయంలోనూ, అనంతరం అసెంబ్లీ లోపలికి మీడియా రాకపోకలపై అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు. తనిఖీల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించిన భద్రతాధికారులు అదే సమయంలో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లడానికి  గేటు వద్దే అడ్డుకున్నారు. అధికారులు జగన్‌ చాంబర్‌ వద్ద గోడ బయట వైపు నుంచి అగ్నిమాపక శకటం ద్వారా నీళ్లు కొట్టారు. కొద్దిసేపటికే గోడ లోపల వైపు నీటి ఊట రావడం పరిశీలనలో తేలింది. తాజాగా మ‌రోమారు వ‌ర్షం నీరు చేర‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.