New Film City in Hyd: హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సీటీ 

Entertainment Published On : Thursday, December 10, 2020 03:15 PM

కరోనావైరస్, లాక్ డౌన్ ప్రభావంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును (CM KCR) ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు గతంలో ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్‌కు వారు అందజేశారు.

నష్టపోయిన చిత్ర పరిశ్రమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే థియేటర్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  సీఎం కేసీఆర్‌ చిత్ర పరిశ్రమ గురించి  చిరంజీవి, నాగార్జునను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోయిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తుందన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని కోరారు. 

హైదరాబాద్ సిటీ శివార్లులో అంతర్జాతీయ స్థాయిలో (international standards) సినిమా సీటీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఫిల్మ్‌సిటీ (New Film City in Hyd) కోసం 1500-2000 ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు త్వరలోనే బల్గేరియా ఫిల్మ్‌సిటీని పరిశీలించనున్నారు.

తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు. వీరితో పాటు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, ప్రభాస్‌ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి  చెరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.