Cricket Betting: ఇద్దరి యువకుల ప్రాణాలు తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌

Crime Published On : Tuesday, December 22, 2020 03:15 PM

Amaravati, Nov 15: క్రికెట్‌ బెట్టింగ్‌ (Cricket Betting in Guntur) ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లాలోని బెల్లంకొండలో బెట్టింగ్‌ నిర్వహించిన ఇద్దరు యువకులు అప్పులపాలయ్యారు. ఈ అప్పులు ఎక్కువ కావడంతో ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్‌, కొమరయ్య పురుగుల మందు (Two Youth Committed Suicide) సేవించారు.

రైల్వె ట్రాక్ పక్కన పడిపోయిన వీరి కోసం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా తొలుత 10న సురేష్ మృతి చెందాడు. బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్యను మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతి చెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 అయితే గ్రామస్థుల సమాచార ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ డబ్బులు కట్టాలంటూ బుకీ ఒత్తిడి తెవడంతోనే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు.

ఈ ఘటనపై స్పందించిన బెల్లంకొండ పోలీసులు యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరావు, బాజీ అనే ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి (Guntur police bust cricket betting racket) తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు బెల్లంకొండ పోలీసులు తెలిపారు.