ఘోరం: 11మంది బాలికలను చంపి పూడ్చి పెట్టారు..!

Crime Published On : Saturday, May 4, 2019 12:47 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌ పూర్‌ అత్యాచార ఘటనపై దర్యాప్తు చేసిన సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. విచారణలో భయంకర నిజాలు వెలుగు చూసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ముజఫర్ పూర్‌ వసతి గృహంలో నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ అకృత్యాలకు ఎందరో బాలికలు బలయ్యారని సీబీఐ నివేదికలో వెల్లడించింది. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలికలకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి బ్రజేష్ ఠాకూర్‌ లైంగికదాడులకు పాల్పడేవాడని సీబీఐ తెలిపింది. బ్రజేష్ ఠాకూర్ చెప్పినట్టు వినకపోతే బాలికలను దారుణంగా హింసించేవాడని, కామవాంఛలు తీర్చేందుకు నిరాకరిస్తే చంపేసేవాడని, బాలికల మర్మాంగాలను గాయపరిచేవాడని అక్కడి బాలికలు వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో తెలిపారు.

కేసు విచారణలో భాగంగా ముజఫర్ వసతి గృహం ఆవరణలో జరిపిన తవ్వకాల్లో ఒక అస్థిపంజరం బయటపడింది. తన మాట విననందుకు చంపి పాతిపెట్టారని సీబీఐ చెప్పింది. బ్రజేష్ ఠాకూరే ఈ హత్య చేశాడని సాక్షాత్తూ అతని డ్రైవరే చెప్పినట్లు సీబీఐ తెలిపింది. ఇక వసతి గృహంలో మిస్ అయిన 11మంది బాలికలు చనిపోయి ఉండవచ్చునని సీబీఐ తెలిపింది. వసతీ గృహంలో మిస్ అయిన బాలికలు, పేర్లతో పోలికలతో 35మందిని గుర్తించగా వారిని విచారించిన సమయంలో 11మంది బాలికలను బ్రజేష్ టాకూర్ చంపి ఉండవచ్చునని తెలిపారు. ఈ కేసులో బీహార్ మాజీ మంత్రి మంజూవర్మ భర్త ప్రమేయం కూడా ఉందని అనుమానాలు వచ్చాయి. దీంతో గతేడాది ఆగస్టులో మంజూ వర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రాజేష్ థాకూర్‌ని కలిసేందుకు వసతి గృహాలకు వచ్చిన అతిథుల కోరికలు తీర్చేందుకు బాలికలను పంపించేవారని విచారణలో తేలింది. వసతి గృహంలో నగ్నంగా డ్యాన్స్ చేసిన వారికి మాత్రమే ఆ పూట బోజనం పెట్టేవారని బాధిత బాలికలు వివరించినట్లు సుప్రీంకోర్టు నివేదికలో సీబీఐ చూపింది.