Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

Crime Published On : Saturday, January 30, 2021 02:15 PM

Chittorgarh, Dec 13: రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Rajasthan Road Accident) చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో రెండు వాహనాలు ఓవర్ టేక్ అవుతూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదిమంది మృతి (Accident in Rajasthan)చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దీగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ కూడా రోడ్డు ప్రమాదంపై సంతాపం తెలిపారు. 

చిత్తో‌ర్‌‌గఢ్‌ (Chittorgarh) జిల్లా‌లోని నికుంబ్‌ వద్ద ఉద‌య్‌‌పూ‌ర్‌-‌నింబహేరా హైవేపై నిన్న రాత్రి క్రూయిజర్‌, ట్రక్‌ ఢీకొన్నాయి. దీంతో పది మంది మరణించారు. క్రూయి‌జర్‌ వాహ‌నాన్ని ట్రక్‌ ఓవ‌ర్‌‌టేక్‌ చేసే ప్రయ‌త్నంలో అదు‌పు‌తప్పి ముందు‌వా‌హ‌నాన్ని బలంగా ఢీకొ‌ట్టింది. దాంతో క్రూయి‌జర్‌ నుజ్జు‌ ను‌జ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరు‌గురు ఆస్పత్రికి తర‌లి‌స్తుం‌డగా చని‌పో‌యారు. మృతుల్లో చాలా‌మంది శరీ‌రాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో అస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా, ప్రమాద విషయం తెలసుకున్న ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘చిత్తోర్‌లోని నికుంభ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ సమయంలో నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటు న్నానని’ ట్వీట్‌ చేశారు. 

అదేవిధంగా ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రాజస్థాన్‌ సీఎం సంతాపం తెలిపారు. ‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. వారు మనో నిబ్బరంతో ఉండాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని’ అన్నారు.
 
ఏపీలోని నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇక ఏపీలో నెల్లూరు జిల్లా నాయుడుపేట దగ్గర స్వర్ణముఖి కాజ్ వేపై రెండు బైకులు ఒకదానికొకటి (Nellore Road Accicent) ఢీకొన్నాయి. ఇద్దరు యువకులు మృతి చెందగా.. దంపతులకు గాయాలయ్యాయి.  కాగా.. మృతులను త్రినాథ్(20), సాయి(22)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ మేనకూరు గ్రీన్‌టెక్‌ కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.