గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు కీలక బాధ్యతలు

Business Published On : Friday, December 13, 2019 03:15 PM

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అత్యున్నత బాధ్యతలను చేపట్టారు. గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 21 సంవత్సరాల కిందట గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను స్ధాపించిన పేజ్‌, బ్రిన్‌లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. సుదీర్ఘకాలంగా కంపెనీ రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలైన తాము ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, సంస్థకు తమ సలహాలు సూచనలు అందిస్తామని పేజ్‌, బ్రిన్‌లు బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు.

వెబ్‌ సెర్చింగ్‌, ఇతర టాస్క్‌లను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిపై జరుగుతున్న కసరత్తును ఇక సుందర్‌ పిచాయ్‌ మున్ముందుకు తీసుకువెళ్లనున్నారు. మేనేజ్‌మెంట్‌లో ప్రక్షాళన నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొని లాభాలపై దృష్టిసారించేందుకు అల్ఫాబెట్‌కు ఇది మంచి అవకాశమని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.