వాహనాలకు స్పెషల్ హారన్లు.. చట్టం తెచ్చే యోచనలో కేంద్రం
రోడ్లపై వాహనాల నుంచి వెలువడే కర్ణకఠోరమైన హారన్ల శబ్దాలకు స్వస్తి పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వాహనాల హారన్ల కోసం భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాలను మాత్రమే వినియోగించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే వాహనాల హారన్లు వినడానికి ఇబ్బందిగా కాకుండా, వినసొంపుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ పత్రిక వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నితిన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. "అన్ని వాహనాల హారన్లు భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలతో ఉండేలా చట్టం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాలు ఆహ్లాదకరంగా ఉంటాయి" అని గడ్కరీ వివరించారు. దేశంలో వాయు కాలుష్యంపై గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం వాయు కాలుష్యంలో రవాణా రంగం వాటానే 40 శాతం ఉందని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, మిథనాల్, ఇథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. భారత ఆటోమొబైల్ రంగం సాధిస్తున్న ప్రగతిని కూడా గడ్కరీ ప్రస్తావించారు. 2014లో రూ.14 లక్షల కోట్లుగా ఉన్న ఈ రంగం విలువ, ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని, ఈ క్రమంలో జపాన్‌ను అధిగమించిందని చెప్పారు.