వాట్సప్ కాల్ చేసి రూ.40 వేలు లాగేశాడు 

Friday, December 27, 2019 02:00 PM Technology
వాట్సప్ కాల్ చేసి రూ.40 వేలు లాగేశాడు 

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయి. వాట్సప్‌ వీడియో కాల్‌ ద్వారా ఒక విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.40 వేలు కాజేసిన సంఘటన పోలీసులనే ఆశ్చర్య పరిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని గోరంట్లకు చెందిన పిఎల్‌.నరసింహారావు హైదరాబాద్‌లోని ఎస్‌బిఐ కోటి బ్రాంచ్‌లో పని చేస్తూ 2014లో రిటైర్మెంట్‌ అయ్యాడు.

ఆయన పెన్షన్‌ ఖాతా వనస్థలిపురంలోని చింతకుంట బ్రాంచ్‌లో ఉంది. గత నెల 12న ఎబిఐ విశ్రాంత ఉద్యోగి మోహన్‌రాజా ఫొటోతో వాట్సప్‌ కాల్‌ వచ్చింది. సిగల్‌ సరిగా లేనందున ఛాటింగ్‌ చేస్తానని చెప్పి, ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. తాను ఫ్రాన్సిస్‌కోలో ఉంటున్నానని, తన భార్య సోదరికి గుండె ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందని, అత్యవ సరంగా రూ.40 వేలు అవసరమని నమ్మించాడు. నరసింహారావు హైదరాబాద్‌లో స్కూటర్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు అతడిని మోహన్‌రాజా ఆసుపత్రిలో చేర్పించి, సహాయ సహకారాలు అందజేశాడు.

ఆ కృతజ్ఞతతో నరసింహారావు వెంటనే అతను చెప్పిన కోయంబత్తూరు, పొదనూర్‌ ఎస్‌బిఐ బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా తన పెన్షన్‌ ఖాతా నుండి రూ.40 వేలు బదిలీ చేశాడు. వెంటనే తనకు వచ్చిన వాట్సప్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. అనంతరం నగదు బదిలీ చేసిన దానిపై తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ జిల్లాలోని పొదనూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదిచి మోసపోయినట్లు నిర్ధారించుకున్నాడు. ఘటనపై ఎస్‌పి విజయరావుకు ఫిర్యాదు చేశాడు.

For All Tech Queries Please Click Here..!