డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఫిర్యాదుల కోసం ఇంటర్నల్ అంబుడ్స్‌మన్

Monday, October 21, 2019 04:00 PM Technology
డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఫిర్యాదుల కోసం ఇంటర్నల్ అంబుడ్స్‌మన్

పేటీఎం వ్యాలెట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్‌పే, మొబీక్విక్, పేయూ, అమెజాన్ పే వంటి వ్యాలెట్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. వ్యాలెట్ల వ్యాపారం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.  వినియోగదారులూ పెరుగుతుండటం వల్ల వారి నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అనేక మోసాలు, అవకతవకలు జరుగుతున్నాయనే  ఆరోపణలు వస్తున్నాయి. అందుకే కస్టమర్ల సమస్యల్ని వేగంగా పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది జనవరిలోనే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 ప్రవేశపెట్టింది.  అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే వ్యాలెట్ సంస్థల నుంచి ఏవైనా సేవా లోపాలు ఉంటే వాటిపై ఫిర్యాదులు చేయడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం. ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఈ అంబుడ్స్‌మన్‌తో పాటు ప్రతీ వ్యాలెట్ సంస్థలో ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఉండాలని ఆర్‌బీఐ వ్యాలెట్లను ఆదేశించింది.  ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన అంబుడ్స్‌మన్ కేవలం ఆన్‌లైన్‌లో చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్లపై కంప్లైంట్లకు మాత్రమే పరిమితం కానుంది. 

వ్యాలెట్‌లో డబ్బులు కనిపించకపోయినా, నిర్ణీత సమయంలో వ్యాలెట్లు రీఫండ్ చేయకపోయినా, రీఫండ్ చేసేందుకు నిరాకరించినా, లావాదేవీలను తిరస్కరించినా, రద్దు చేసినా వినియోగదారులు కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఆన్‌లైన్ పేమెంట్‌లో జాప్యం జరిగినా, మీరు డబ్బులు చెల్లించినా అవతలివాళ్లకు చేరకపోయినా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు మీ డబ్బులు మీకు తిరిగిరాకపోయినా ఫిర్యాదు చేయొచ్చు. మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు పంపినవారికి చేరకపోతే మీరు అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు.

For All Tech Queries Please Click Here..!