అనిల్ అంబానీకి ఊరట , రూ.104కోట్లు చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు

Saturday, January 18, 2020 03:00 PM Technology
అనిల్ అంబానీకి ఊరట , రూ.104కోట్లు చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు

రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ వివాదంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది.  టెలికాం డిస్‌ప్యూట్స్‌ సెటిల్‌మెంట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(టీడీఎస్‌ఏటీ) తీర్పుని సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం  తిరస్కరించింది. కేంద్రం అప్పీల్‌లో ఎలాంటి యోగ్యత కనిపించడం లేదని జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం  పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం  కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ .104 కోట్లను ఆర్‌కామ్‌కు తిరిగి చెల్లించాల్సి వుంది.  బకాయిలకు సంబంధించి ఆర్‌కామ్‌, టెలికాం విభాగం మధ్య ఉన్నఅనేక వివాదాల్లో ఇదొకటి కావడం గమనార్హం.

కాగా స్పెక్ట్రం కోసం బ్యాంక్ గ్యారెంటీ బ్యాలెన్స్‌గా అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్‌ చెల్లించిన రూ.908 కోట్ల పూచీకత్తులో.. రూ.774కోట్ల ఛార్జీల మొత్తం పోనూ మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఆర్‌కామ్‌ డిసెంబర్ 2018లో  టీడీఎస్‌ఏటీని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ ఇంకా దాదాపు రూ.104కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే రూ.30.33 కోట్లు ఆర్‌కామ్‌కు చెల్లించింది. ఈ ఆదేశాన్ని ప్రభుత్వం సవాలు చేసింది. కాగా భారీ వ్యాపార నష్టాలు,  పెరుగుతున్న అప్పుల కారణంగా ఆర్‌కామ్ 3 సంవత్సరాల క్రితం కార్యకలాపాలను మూసివేసింది.  2019 లో దివాలా తీసిన సంగతి తెలిసిందే.

For All Tech Queries Please Click Here..!