ఏటీఎం అలర్ట్ : ఇకపై రోజుకు ఒకసారే డ్రా చేసుకోవాలి 

Thursday, September 19, 2019 01:50 PM Technology
ఏటీఎం అలర్ట్ : ఇకపై రోజుకు ఒకసారే డ్రా చేసుకోవాలి 

బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఢిల్లీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) విత్ డ్రాయల్స్‌పై పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య 6నుంచి 12గంటల గ్యాప్ ఉండేలా కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలో తమ ప్రతిపాదనను బ్యాంకర్లు వ్యక్తపరిచారు. ఆర్థిక సేవల శాఖ ఆదేశాల మేరకు బ్యాంకుల కోసం బాటమ్స్-అప్ ఐడిషన్‌లో భాగంగా బ్యాంకు ఆర్థిక సర్వీసులపై గతవారమే 18 బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏటీఎంలో మనీ విత్ డ్రా విషయంలో లావాదేవీల మధ్య సమయాన్ని తగ్గించడంపై సుదర్ఘీంగా చర్చ జరిగింది.  ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బులు నిర్ణీత సమయంలో తీసుకోవడానికి వీలుండదు.

దీని ప్రకారం ఇకపై ప్రతి రెండు లావాదేవీలకు మధ్య కచ్చితమైన సమయం తప్పనిసరి కానుంది. కనీసం 6 గంటల నుంచి 12 గంటల మధ్య సమయం ఉండాలి. అప్పుడే ఏటీఎం నుంచి మనీ బదిలీ చేయడం కుదురుతుంది.  ఇటీవల దేశవ్యాప్తంగా పలు ఏటీఎంల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎనీ టైమ్ మనీ అంటూ రాత్రి పగలు అంటూ తేడా లేకుండా మనీ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో ఇది మోసగాళ్లకు వరంగా మారిందని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీ, సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు. ఏటీఎం మోసాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఢిల్లీ రెండోస్థానంలో ఉంది. 

దీంతో పాటు ఏటీఎం సెంటర్లలో డబ్బులు విత్ డ్రా చేసే వ్యక్తులను మాటల్లో పెట్టి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి డబ్బులు కాజేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఏటీఎం మోసాలకు పాల్పడే వారిలో విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. బ్యాంకర్లు మోసాలు అడ్డుకునేందుకు పలు చర్యలు ప్రకటించారు. అందులో ఒకటి వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ఏటిఎం విత్ డ్రాయెల్ విధానం. ఇక్కడ ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం అవుతుంది. 

ఇది క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ లావాదేవీలను పోలి ఉంటుంది. అలాగే ఎవరైనా హెల్మెట్ పెట్టుకుని ఏటీఎం సెంటర్‌కి వెళ్తే.. హెల్మెట్ తీయండి అని వాయిస్ వినిపిస్తుంది. దాంతో అతడు కెమెరా కంటికి చిక్కుతాడు. ప్రస్తుతం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు చెందిన 300 ఏటీఎం సెంటర్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. త్వరలోనే బ్యాంకులన్నీ ఈ వ్యవస్థను ఏర్సాటు చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే బ్యాంకర్ల సమావేశంలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్‌లు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్బీఐ తన కస్టమర్లకు విత్‌డ్రా లిమిట్ 20వేలకు తగ్గించగా.. 10వేలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీ కచ్చితం చేసేలా కెనరా బ్యాంకు భావించింది.
 

For All Tech Queries Please Click Here..!