హాకీ వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా శుభారంభం, ఇంగ్లాండ్‌కు చైనా షాక్

Saturday, December 1, 2018 03:01 PM Sports
హాకీ వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా శుభారంభం, ఇంగ్లాండ్‌కు చైనా షాక్

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా తన మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన పూల్-బీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2-1 గోల్స్‌తో ఐర్లాండ్‌ను ఓడించింది.

తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన ఐర్లాండ్

పదో ర్యాంక్‌లో కొనసాగుతున్న ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో అటు డిఫెన్స్‌, అటాకింగ్‌లో అదరగొట్టి ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుకు 5 పెనాల్టీకార్నర్‌లు లభించినా వీటిలో ఒక్కదానినే సద్వినియోగం చేసుకోగలిగింది.

ఐర్లాండ్‌కు ఏకైక గోల్ అందించిన షేన్‌ డోంగ్యూ

ఆస్ట్రేలియా తరఫున బ్లేక్‌ కార్నర్‌ (11వ నిమిషం), టిమ్‌ బ్రాండ్‌ (34వ) గోల్స్‌ సాధించగా, ఐర్లాండ్‌ జట్టులో షేన్‌ డోంగ్యూ (13వ) ఐర్లాండ్‌కు ఏకైక గోల్ అందించాడు. తొలిరెండు క్వార్టర్స్‌లో రెండు జట్లూ హోరాహోరీ పోరాటంతో అలరించాయి. ఆట నాలుగో నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు సీన్ ముర్రే కొట్టిన కచ్చితమైన షాట్‌ను ఆసీస్ గోల్‌కీపర్ ఆండ్రూ చార్టర్ అడ్డుకున్నా బంతిని నియంత్రించలేక పోయాడు.

గోల్ కాకుండా నిలువరించిన చార్టర్

అదే సమయంలో గోల్ పోస్ట్ వద్ద కాచుకుని ఉన్న ఐర్లాండ్ ఫార్వర్డ్ మాథ్యూ నెల్సన్ కొట్టిన రీబౌండ్ షాట్‌ను కూడా చార్టర్ గోల్ కాకుండా నిలువరించాడు. ఆస్ట్రేలియాకు లభించిన రెండో పెనాల్టీకార్నర్‌ను గోవర్స్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని అందించినా.. మరో రెండు నిమిషాల్లోనే ఐర్లాండ్ కూడా గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది. చివరకు మిడ్‌ఫీల్డ్ నుంచి వచ్చిన పాస్‌ను బాక్స్ సమీపంలో అందిపుచ్చుకున్న ఆసీస్ ఆటగాడు టిమ్ బ్రాండ్ గోల్ సాధించి జట్టుకు 2-1తో జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్‌‌ను దాదాపు ఓడించినంత పని చేసిన చైనా

తొలిసారి హాకీ వరల్డ్ కప్ ఆడుతున్న చైనా చక్కటి ప్రదర్శన చేసింది. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఆఖరి నిమిషంలో గోల్‌తో 2-2 స్కోరుతో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన ఇంగ్లండ్ జట్టు ఊపిరిపీల్చుకుంది. జియోపింగ్‌ 5వ నిమిషంలో ఫీల్డ్‌ గోల్‌ కొట్టి చైనా ఖాతా తెరిచాడు. మార్క్‌ గ్లెగోర్న్‌ (14వ నిమిషంలో) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇంగ్లాండ్‌ స్కోరు సమం చేసింది. 48వ నిమిషంలో చైనా డిఫెన్స్‌ తప్పిదం కారణంగా ఇంగ్లాండ్‌ మరో గోల్‌ చేసింది. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా తలాకె పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి చైనా జట్టులో ఆనందాన్ని నింపాడు.

For All Tech Queries Please Click Here..!