అమరావతిలో వైసీపీ నెక్స్ట్ టార్గెట్, వ్యూహరచనలో ఎమ్మెల్యే. టీడీపీకి భారీ షాక్ తప్పదా .!

Saturday, March 21, 2020 11:30 AM Politics
అమరావతిలో వైసీపీ నెక్స్ట్ టార్గెట్, వ్యూహరచనలో ఎమ్మెల్యే. టీడీపీకి భారీ షాక్ తప్పదా .!

ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతిలో చోటు చేసుకున్న పలు అక్రమాలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ ద్వారా కేసులు నమోదు చేయించిన వైసీపీ సర్కారు, ఈ ప్రాంతంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా తర్వాతి దశలో టీడీపీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోబోతోంది. నిబంధనల ఉల్లంఘన పేరుతో ఇప్పటికే మంగళగిరిలోని ఆత్మకూరు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపిన పురపాలక శాఖ త్వరలో వీటిపై చర్యలకు ఉపక్రమించబోతోంది. అలాగే గుంటూరులోని టీడీపీ నగర కార్యాలయం లీజు విషయంలో అక్రమాలను బయటపెట్టబోతోంది.

గుంటూరు పట్టణంలోని పిచ్చుకలగుంటలో రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ స్ధలాన్ని లీజుకు తీసుకుని టీడీపీ పట్టణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. నగరం విస్తరించడం, రాజధాని రాక తర్వాత టీడీపీకి కేంద్ర కార్యాలయం లేకపోవడంతో దీన్నే రాష్ట్ర కార్యాలయంగా కూడా వాడుకున్నారు. అయితే 30 ఏళ్ల లీజు కాలంలో ఇప్పటికే దాదాపు పూర్తి కావడంతో ప్రభుత్వ అవసరాల మేరకు నిబంధనల మేరకు దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో లీజు కోసం చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తున్న ప్రభుత్వం, త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చాక దీని కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.