నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తెర...

Wednesday, December 5, 2018 12:34 PM Politics
నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి  తెర...

ప్రజా ప్రయోజనాల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో వచ్చే ఏడాది ఏపీతో పాటుగా జరగాల్సిన తెలంగాణ ఎన్నికలు ముందుగానే వచ్చాయి. ఈ  ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్, ప్రజాకూటమి మరియు బీజేపీ పార్టీలు వీలైనంత వరకు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని సాగించాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం రాజకీయ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు పోలింగ్‌కు 48 గంటలు ముందే ప్రచారాన్ని ముగించాలి. ఈ రెండు రోజుల నిషేధిత సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎలాటి బహిరంగ సభలు, ప్రసంగాలు, ఊరేగింపులు, సినిమా, టీవీ మరియు మరే ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్దం.

శుక్రవారం (డిసెంబరు 07) పోలింగ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రచారానికి నేడే తుది గడువు. అయితే చత్తీస్‌గఢ్ సరిహద్దులకు సమీపంగా ఉన్న మావోయిస్ట్ ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం మొత్తం 13 చోట్ల ప్రచారం బుధవారం సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించవచ్చు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఒక గంట ముందే మొదలై సాయంత్రం ఒక గంట ముందుగా ముగుస్తుంది.

For All Tech Queries Please Click Here..!