పోలీస్‌ వేషంలో దోపిడీ చేస్తూ దొరికిపోయిన టీడీపీ నేత..!

Monday, April 22, 2019 12:37 PM Politics
పోలీస్‌ వేషంలో దోపిడీ చేస్తూ దొరికిపోయిన టీడీపీ నేత..!

ఆ టీడీపీ నాయకుడు బంగారం బిస్కెట్లను అక్రమంగా తరలించే ముఠాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. బంగారం బిస్కెట్లు కొనేందుకు వెళ్లే వారినుంచి సినిమాలో జరిగేలాగా పోలీస్‌ వేషంలో నగదు దోపిడీ చేయడం మొదలుపెట్టాడు. ఇదే తరహాలో రూ.56 లక్షలు దోచేశాడు. బంగారం వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మర్రి రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడిచ్చిన సమాచారం మేరకు రూ.36 లక్షలను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే, కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారం బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం మధ్యవర్తికి రూ.56 లక్షలు ఇచ్చాడు. పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు.

ఆ ముగ్గురూ చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగా పోలీసులమంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గుర్నీ బెదిరించారు. భయపెట్టి వారివద్ద ఉన్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు. సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా మాడుటవర్తి  తోపాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మహిళల్లో ఒకరి ఫోన్‌ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్‌కు పెద్దఎత్తున కాల్స్‌ వెళ్లినట్టు కాల్ డేటా ద్వారా గుర్తించారు. మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంటబెట్టుకుని చెన్నాయపాళెం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. 

For All Tech Queries Please Click Here..!